: మన పోలీసుల తీరే అంత...దొంగతో బూట్లు కొనిపించుకోబోయి...11 మంది సస్పెండయ్యారు!


'ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తున్నాం' అని అధికారులు ఎప్పటికప్పుడు చెబుతున్నా... కొంత మంది కారణంగా పోలీసు వ్యవస్థ మొత్తం ఎప్పటికప్పుడు విమర్శలపాలవుతూనే వుంది. ఈ నేపథ్యంలో కరుడుగట్టిన ఓ నేరస్తుడి నుంచి లంచం ఆశించి సస్పెండ్ అయిన పోలీసుల ఉదంతం ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఆగ్రాలో మిట్టమధ్యాహ్నం రద్దీగా ఉండే ఓ షోరూంలో కాళ్లు, చేతులకు సంకెళ్లు వేసిన ఓ వ్యక్తి ప్రవేశించాడు. అతని వెనుక 11 మంది సాయుధులైన పోలీసులు కూడా వచ్చారు. సంకెళ్లతో ఉన్న ఆ నేరస్తుడు దర్జాగా సోఫాలో కూర్చుని పోలీసులందరికీ షూలు చూపించమని దుకాణదారును ఆదేశించాడు. ఇదంతా చూసి విస్తుపోయిన షాప్ ఓనర్ తనకు తెలిసిన మీడియా మిత్రులకి ఈ విషయం వివరించాడు. ఇంకేముంది, వెంటనే ఆ జర్నలిస్టులు కెమెరాలుతో అక్కడ వాలిపోయారు. అలా మీడియా రావడం చూసిన దొంగ, పోలీసులు నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నారు. ఈ ఘటన మీడియాలో ప్రసారం కావడంతో అవాక్కయ్యే విషయం వెలుగు చూసింది. సంకెళ్లతో ఉన్న వ్యక్తి మనోజ్ బక్కర్ వాలా అని, ఇతనిపై 10 రాష్ట్రాల్లో 300కు పైగా కేసులు ఉన్నాయని తెలుస్తోంది. 2010లో తన ప్రియురాలి భర్త కుటుంబాన్ని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ కేసులో 2012లో అరెస్టైన అతను మూడుసార్లు పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. కాగా, విచారణ నిమిత్తం తీహార్ జైలు నుంచి ఆగ్రా కోర్టుకు తీసుకెళ్లిన పోలీసులు, విచారణ ముగిసిన అనంతరం తిరుగు ప్రయాణంలో అతనితో బూట్లు కొనిపించుకోబోయి మీడియాకు చిక్కారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఢిల్లీ, ఆగ్రా పోలీసు అధికారులు ఆ 11 మంది పోలీసులను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

  • Loading...

More Telugu News