: మోదీ కోసం ఒలింపిక్స్ తరహా వేడుకలు... కనీవినీ ఎరుగని స్వాగత ఏర్పాట్లు చేస్తున్న బ్రిటన్


ఈ సంవత్సరం నవంబర్ లో తమ దేశంలో పర్యటించనున్న భారత ప్రధాని మోదీకి, దేశ చరిత్రలో ఏ నేతకూ ఇవ్వనంత ఘనమైన స్వాగతాన్ని ఇవ్వాలని బ్రిటన్ సంకల్పించింది. నవంబర్ రెండో వారంలో మోదీ పర్యటన ఖరారు కాగా, ఇక్కడి ప్రఖ్యాత 'వాంబ్లే' స్టేడియంలో 'ఒలింపిక్ స్టైల్' తరహాలో స్వాగతం పలకాలని నిర్ణయించింది. ఈ స్టేడియంలోనే సుమారు 70 వేల మంది ఆహూతులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు కూడా. మోదీ విదేశాల్లో అత్యధికులను ఉద్దేశించి చేసే ప్రసంగం కూడా ఇదే కానుంది. "టూ గ్రేట్ నేషన్స్. వన్ గ్లోరియస్ ఫ్యూచర్" థీమ్ తో స్వాగత వేడుకలు జరుగుతాయని యూరప్ ఇండియా ఫోరమ్ ప్రకటించింది. స్టేడియంలో సాంస్కృతిక ప్రదర్శనలు అబ్బుర పరిచేలా ఉంటాయని, ఫైర్ వర్క్స్ అందరినీ ఆకర్షిస్తాయని, అదే సమయంలో భారత్ లో దీపావళి జరగనుండటంతో, అంతే తరహా దీపాల కాంతులు విరజిమ్మనున్నాయని భారతీయ జనతా పార్టీ ఓవర్సీస్ ఫ్రెండ్స్ కన్వీనర్ విజయ్ చౌతియావాలే వివరించారు. ఈ వేడుకలకు పలువురు బ్రిటన్ ఎంపీలు, వ్యాపారవేత్తలు పాల్గొంటారని, ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కళాకారులు తమ ప్రదర్శనలు ఇవ్వనున్నారని వివరించారు. ఆహూతుల రిజిస్ట్రేషన్ కోసం 'www.ukwelcomesmodi.org' పేరిట ప్రత్యేక వెబ్ సైట్ ను ఆవిష్కరించామని వెల్లడించారు. ఇండియాతో బలమైన సంబంధాలు కోరుకుంటున్న బ్రిటన్, మోదీకి మరచిపోలేని ఆతిథ్యం ఇవ్వనుందని ఆ దేశ ఉపాధి కల్పనా శాఖ సహాయ మంత్రి ప్రీతీ పటేల్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News