: మైక్రోమ్యాక్స్ పై షికార్లు చేస్తున్న పుకార్లు!
ఇండియాలోని రెండవ అతిపెద్ద మొబైల్ హ్యాండ్ సెట్ అమ్మకందారుగా నిలిచి, ఇటీవలే ప్రపంచంలోని టాప్ మొబైల్ ఫోన్ కంపెనీల్లో ఒకటిగా నిలిచిన మైక్రోమ్యాక్స్ అంతర్గత వ్యవహారాలపై పుకార్లు వెల్లువెత్తుతున్నాయి. గత కొంత కాలంగా సంస్థ మొబైల్ విక్రయాల వృద్ధి తగ్గిపోతుండటం ఒకవైపు ఆందోళన కలిగిస్తుండగా, ఇదే సమయంలో సంస్థ నుంచి చైర్మన్ సంజయ్ కపూర్ తప్పుకోవడానికి ప్రమోటర్లతో వచ్చిన విభేదాలే కారణమన్న వార్తలు వస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయి విస్తరణ, కొత్త ఇన్వెస్టర్లను తీసుకురావడం, ఆన్ లైన్ విధానంలో డిస్ట్రిబ్యూషన్, అమ్మకాలు తదితర విషయాల్లో సంస్థ ప్రధాన ఉద్యోగులు, ప్రమోటర్లకు మధ్య గొడవలు జరిగాయని సమాచారం. ఈ విషయమై మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు రాజేష్ అగర్వాల్ ను వివరణ కోరగా, "ఆయన తన జీవితంలో కొత్తగా మరేదో చేయాలనుకున్నారు. ప్రమోటర్లు, సంజయ్ మధ్య గొడవలు వచ్చాయన్నది ఊహాజనితమే. మా మధ్య ఎటువంటి విభేదాలూ లేవు" అని చెప్పిన ఆయన ఇతర విషయాలపై స్పందించేందుకు నిరాకరించారు. కాగా, లావా, ఇంటెక్స్, కార్బన్ వంటి సంస్థల విక్రయాలు పెరుగుతుండటంతో మైక్రోమ్యాక్స్ మార్కెట్ వాటా తగ్గుతోంది. పోటీలో ఉన్న కంపెనీలతో పోలిస్తే సెల్ ఫోన్ విక్రయాల వృద్ధి విషయంలో మైక్రోమ్యాక్స్ వెనుకబడింది. మైక్రోమ్యాక్స్ మార్కెట్ వాటా 18 శాతం నుంచి 14.8 శాతానికి దిగజారగా, ఇదే సమయంలో ఇంటెక్స్ వాటా 7.9 శాతం నుంచి 10.4 శాతానికి పెరిగిందని సైబర్ మీడియా రీసెర్చ్ వెల్లడించింది. ఇదే సమయంలో మార్కెట్ అగ్రగామి శాంసంగ్ వాటా 24.6 శాతం నుంచి 23.7 శాతానికి తగ్గింది. భారత మొబైల్ మార్కెట్లోకి వెల్లువలా వచ్చి, మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త వెరైటీలు విడుదల చేసి ప్రజలకు దగ్గరైన మైక్రోమ్యాక్స్ లో పరిస్థితి మారినట్టు స్పష్టంగా తెలుస్తోందని సైబర్ మీడియా రీసెర్చ్ జీఎం ఫైజల్ ఖావోసా వివరించారు.