: హత్య చేయడానికి వచ్చిన వ్యక్తినే వెంటాడిన మృత్యువు
పిల్లనిచ్చిన మామను హత్య చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తిని మృత్యువు వెంటాడింది. ఈ ఘటన అనకాపల్లి సమీపంలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం అనకాపల్లికి చెందిన శ్రీనుకు, వమ్మవరం గ్రామానికి చెందిన మంగాదేవికి వివాహం జరిగింది. వీరిద్దరి మధ్యా తరచూ గొడవలు వస్తుండేవి. భార్య మీద కోపంతో, ఆమె తండ్రి వెంకటరమణను హతమార్చాలని పథకం వేసిన శ్రీను, శుక్రవారం రాత్రి వారి గ్రామానికి వచ్చాడు. వెంకటరమణ పశువుల పాకలో నిద్రిస్తుండటాన్ని గమనించి, సజీవదహనం చేయాలన్న ఉద్దేశంతో పాకకు నిప్పంటించాడు. దీన్ని చూసిన స్థానికులు మంటలు ఆర్పేందుకు రావడంతో, శ్రీను పరుగు లంఘించుకున్నాడు. రోడ్డుపై పరిగెత్తుతున్న అతన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రగాయాలతో ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో శ్రీను మృతి చెందగా, అగ్ని ప్రమాదం నుంచి వెంకటరమణ క్షేమంగా బయటపడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.