: ఇంటరాగేషన్ లో పాక్ ఉగ్రవాది సజ్జాద్ వెల్లడించిన వివరాలు ఇవే...!
కాశ్మీర్ లో సజీవంగా పట్టుబడ్డ మరో పాక్ ఉగ్రవాది సజ్జాద్ అహ్మద్ ఇంటరాగేషన్ లో పలు విషయాలను వెల్లడించాడు. తాను లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వాడినని సజ్జాద్ స్పష్టం చేశాడు. ఉత్తర కాశ్మీర్ లో తమ నెట్ వర్క్ ను విస్తరింపజేసే పనిని లష్కర్-ఏ-తోయిబా తమకు అప్పజెప్పిందని... ఈ పనిమీదే తాము భారత్ లో అడుగుపెట్టామని చెప్పాడు. దాదాపు 20 గంటలపాటు కొనసాగిన కాల్పుల అనంతరం భద్రతాదళాలకు సజ్జాద్ ప్రాణాలతో దొరికిపోయాడు. అతనితో పాటు వచ్చిన మరో నలుగురు ఉగ్రవాదులు ఎన్ కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయారు. శ్రీనగర్ కు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న రఫియాబాద్ లో లష్కర్ నెట్ వర్క్ ను వీరు నెలకొల్పాల్సి ఉంది. పాకిస్థాన్ లోని ముల్తాన్ ప్రావిన్స్ లో ఉన్న ముజఫర్ ఘర్ లో తన కుటుంబం నివసిస్తోందని సజ్జాద్ తెలిపాడు. లష్కర్ సంస్థలో చేరక ముందు తాను లేబర్ గా పనిచేస్తుండేవాడినని వెల్లడించాడు. తమ గ్రూపు ఆగస్టు 17-20 తేదీల మధ్యలో భారత్ లో ప్రవేశించిందని చెప్పాడు.