: వార్డుకో మండపం చాలు... నగరం స్తంభించేలా ఊరేగింపులెందుకు?: వినాయకచవితిపై బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా హిందువులు పరమ పవిత్రంగా, ఆనందోత్సాహాల నడుమ జరుపుకునే వినాయక చవితి వేడుకలపై బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ముంబైలోని శివాజీ పార్కులో రథయాత్ర నిర్వహిస్తామని చెబుతూ, అందుకు అనుమతించాలని ఇస్కాన్ దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ వీఎం కనడే, జస్టిస్ షాలినీ పన్సల్కర్ లతో కూడిన ధర్మాసనం విచారించింది. భారత న్యాయ నిబంధనల ప్రకారం, ఇటువంటి కార్యకలాపాలకు తాము దూరం అంటూ, నగరం మొత్తం స్తంభించేలా వేడుకలు అవసరమా? అని ప్రశ్నించింది. భారీ హంగులతో, ఊరేగింపులతో పండగ నిర్వహించడం మానుకోవాలని, ఒక వార్డుకు ఒక మండపం చాలని అభిప్రాయపడింది. వినాయక మండపాలను ప్రారంభించిన లోకమాన్య తిలక్ బతికుంటే, ఇప్పటి ఉత్సవాల తీరును తప్పుబట్టేవారని వ్యాఖ్యానించిన కోర్టు, మండపాల పేరిట ప్రజల నుంచి డబ్బులు గుంజుతున్నారని, భారీ మైక్ సెట్లతో గాలిని కలుషితం చేస్తున్నారని చెబుతూ, నిశ్శబ్దంగా పూజలు చేసుకోలేమా? అని ప్రశ్నించింది. శివాజీ పార్కులో పూజలకు అంగీకరించమని తేల్చి చెప్పింది.