: షాకింగ్... ఆ రాష్ట్రంలోని లక్ష మంది రైతులు వ్యవసాయాన్ని వదులుకున్నారు!
దేశానికి అన్నంపెట్టే అన్నదాతలకు గిట్టుబాటు ధరలు లభించక, అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఉదంతాలు మనకు చాలానే తెలుసు. అయితే, తాజా జనాభా గణన లెక్కలు భవిష్యత్ దిగుబడిని ప్రశ్నార్థకం చేసేలా దిగ్భ్రాంతికర గణాంకాలను వెలువరించాయి. గడచిన ఐదేళ్లలో మహారాష్ట్రకు చెందిన లక్ష మంది రైతులు వ్యవసాయాన్ని వదులుకున్నారు. 2010-11 లెక్కల ప్రకారం మహారాష్ట్రలో 1.36 కోట్ల మంది రైతు కుటుంబాలు ఉండగా, ఆ సంఖ్య 2014-15 నాటికి 1.35 కోట్లకు చేరింది. ఈ పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని రాష్ట్ర రెవెన్యూ, వ్యవసాయ శాఖల మంత్రి ఏక్ నాథ్ ఖాడ్సే వ్యాఖ్యానించారు. పారిశ్రామికీకరణ కోసం భూముల స్వాధీనం, రోడ్ల వెడల్పులు, కొత్త రహదారుల నిర్మాణం తదితరాంశాల కారణంగా కూడా రైతులు తమ వ్యవసాయ భూమిని త్యాగం చేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని రైతుల్లో 90 లక్షల మంది సన్నకారు రైతులేనని, వీరి వద్ద ఒక హెక్టారు కన్నా తక్కువ పొలాలే ఉన్నాయని తెలిపారు. మిగతా రాష్ట్రాల్లోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. వేల సంఖ్యలో రైతులు ఇతర ఆదాయ మార్గాలను అన్వేషించుకుంటూ, వ్యవసాయాన్ని వీడుతున్నారని తెలుస్తోంది.