: పెద్దఎత్తున రంగంలోకి దిగిన వైకాపా శ్రేణులు... స్తంభించిన ఏపీ


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయడమే లక్ష్యంగా తెల్లవారుఝాము నుంచే ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు వీధుల్లోకి వచ్చారు. వారి తొలి లక్ష్యం ఆర్టీసీ బస్ డిపోలయ్యాయి. డిపోల నుంచి ఒక్క బస్సు కూడా బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఇంతవరకూ ఒక్క బస్సు కూడా బయటకు రాలేదు. కడప జిల్లాలో 8 డిపోల పరిధిలో 900 బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. అన్ని డిపోల వద్దా బస్సులను వైకాపా శ్రేణులు అడ్డుకుంటున్నాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరులో జరుగుతున్న ఆందోళనలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొన్నారు. డిపో ఎదుట బైఠాయించిన ఆయన బస్సులను అడ్డుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస వద్ద డిపోల నుంచి బయటకు వచ్చిన బస్సులపై వైకాపా కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఏలూరు బస్టాండ్ వద్ద కూడా ఇదే తరహా ఘటనలు జరగడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. తణుకు పరిధిలో వైకాపాతో పాటు సీపీఐ, బీఎస్పీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. దీంతో ఏపీ దాదాపుగా స్తంభించిపోయింది. అన్ని ప్రాంతాల్లో పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. తిరుపతి పూర్ణకుంభం సెంటర్ వద్ద వందల సంఖ్యలో వైకాపా నేతలు ధర్నా మొదలుపెట్టారు. తిరుమల బస్సులకు మాత్రం బంద్ నుంచి మినహాయింపునిచ్చారు.

  • Loading...

More Telugu News