: కృష్ణమ్మను చేరేందుకు గోదావరి ఉరకలు!
నదుల అనుసంధానానికి తొలి అడుగుగా గోదావరి నదిలోని నీరు కృష్ణమ్మవైపు కదిలింది. పోలవరం కుడికాలువలో నీరు ఉరుకులు పెట్టింది. పెద్దగా హడావుడి లేకుండా ఈ కార్యక్రమం జరిగిపోయింది. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం గుడ్డిగూడెం వద్ద తాడిపూడి ఎత్తిపోతల కాలువ నుంచి 150 క్యూసెక్కుల నీటిని అధికారులు పోలవరం కుడి కాలువలోకి విడుదల చేశారు. ఇది ట్రయల్ రన్ మాత్రమేనని ఈ సందర్భంగా ఇంజనీర్లు ప్రకటించారు. ఇటీవలే పట్టిసీమ ఎత్తిపోతల పథకం జాతికి అంకితమైన సంగతి తెలిసిందే. తొలుత తాడిపూడి కాల్వ పరిధిలోని రైతుల అవసరాలు తీరిన తర్వాత మాత్రమే ఈ మళ్లింపు జరుగుతుందని అధికారులు వెల్లడించారు. గోదావరిలో నీరు పెరుగుతూ ఉండి, పట్టిసీమ పనులు కొన్ని నిలిచి ఉండటంతోనే ఈ కాలువలో నీరు తరలిస్తున్నామని వివరించారు.