: షీనా బోరా మర్డర్ కేసులో లేటెస్ట్ డెవలప్ మెంట్స్...
దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న షీనా బోరా మర్డర్ కేసు అత్యంత వేగంగా పలు మలుపులు తిరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న ఈనాటి డెవలప్ మెంట్స్ ఇవే... 1. షీనా బోరాను హత్య చేసిన అనంతరం, ఆమెను తగలబెట్టిన ప్రాంతాన్ని ముంబై పోలీసులు తవ్వారు. ఈ సందర్భంగా ఆమెకు చెందిన కొన్ని ఎముకలు, పుర్రెతో పాటు ఒక సూట్ కేసును స్వాధీనం చేసుకున్నారు. 2. షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జియా మాజీ భర్త సంజీవ్ ఖన్నాకు ముంబై కోర్టు ఆగస్టు 31 వరకు పోలీస్ రిమాండ్ విధించింది. 3. షీనా సోదరుడు మిఖాయిల్ బోరా గౌహతి నుంచి ముంబై చేరుకున్నాడు. తన సోదరి హత్య కేసులో పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని అతను వెల్లడించాడు. 4. ఇంద్రాణి ముఖర్జియాను పోలీసులు గుర్తు తెలియని ప్రదేశానికి తరలించి, విచారిస్తున్నారు. 5. ఇంద్రాణి ముఖర్జియాను కలవడానికి ఆమె లాయర్ కు ముంబైలోని బాంద్రా కోర్టు అనుమతించింది. ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. 6. షీనా బోరా హత్యకు గురైన కొన్ని వారాల తర్వాత... ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు షీనా పనిచేస్తున్న కంపెనీకి రాజీనామా లేఖ అందింది. షీనా రాసినట్టు రాజీనామా లేఖ రాసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.