: షీనా బోరా హత్య కేసులో కీలక ఆధారాలు మాయం...కేసులో కొత్త ట్విస్టు
షీనా బోరా హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో షీనా బోరా తల్లి, తండ్రి, సోదరుడు అంతా పోలీస్ కస్టడీలో ఉన్నారు. క్షణానికో కథనం వెలుగు చూడడంతో దేశ వ్యాప్తంగా ఈ కేసుపై ఆసక్తి రేగుతోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో కీలక ఆధారాలు మాయమైనట్టు తెలుస్తోంది. 2012 మే 23న రాయ్ గఢ్ జిల్లా పేన్ తాలూక గొగెబె బద్రూక్ గ్రామస్థులు స్థానిక అడవుల నుంచి దుర్వాసన వస్తోందని, వచ్చి చూడాలని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న ఓ శవాన్ని గుర్తించారు. అక్కడ గులాబీ రంగు వస్త్రం, ఓ దంతం, కుడి చేయి ఎముకను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. అప్పట్లో ఎక్కడా మిస్సింగ్ కేసు నమోదు కాకపోవడంతో ఆ కేసును క్లోజ్ చేసేశారు. మళ్లీ ఇన్నాళ్లకు ఇంద్రాణి ముఖర్జియా డ్రైవర్ గన్ కలిగి ఉండడంపై విచారణ చేపట్టిన పోలీసులు 2012లో దొరికింది షీనా బోరా మృతదేహానికి సంబంధించిన అవశేషాలే అని గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న అందర్నీ కటకటాల వెనక్కి పంపుతున్నారు. ఈ నేపథ్యంలో అప్పట్లో ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపిన గులాబీ రంగు వస్త్రం, దంతం, కుడి చేతి ఎముక ఇప్పుడు మాయమైనట్టు గుర్తించారు. అవేమయ్యాయన్న దిశలో అప్పటి ఫోరెన్సిక్ ల్యాబ్ సిబ్బందిని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో తన పలుకుబడిని ఉపయోగించి వాటిని ఇంద్రాణి ముఖర్జియా మాయం చేయించిందా? అన్న కోణంలో కూడా విచారణ చేస్తున్నారు.