: టూరిస్టే కదా అని ఈజీగా తీసుకున్న టర్కీ వ్యాపారులు...‘పంచ్’ పవర్ చూపిన ఐర్లాండ్ బాక్సర్
టర్కీ... పర్యాటకులకు స్వర్గధామం. అందుకేనేమో ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు చెందిన వారు ఆ దేశంలో పర్యటించేందుకు అమితాసక్తి చూపుతారు. ఇటీవలే ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కూడా కుటుంబసమేతంగా అక్కడ సేదదీరి వచ్చారు. ఇలా వెల్లువలా వస్తున్న పర్యాటకులను టర్కీవాసులు అంత మర్యాదగా చూసుకోవడం లేదు. ఇటీవల ఓ విదేశీయుడు అక్కడి ఓ చిన్న షాపులో చేసిన అతిచిన్న పొరపాటుకు ఆ షాపు యజమాని ఆగ్రహంతో ఊగిపోయాడు. తోటి వ్యాపారులతో కలిసి సదరు టూరిస్ట్ పై మూకుమ్మడి దాడికి దిగాడు. అయితే సీన్ రివర్సైపోయింది. ఆ టూరిస్ట్ చేతితో వ్యాపారి ముష్టి ఘాతాలు తినాల్సి వచ్చింది. అంతేకాదండోయ్, ఆ వ్యాపారికి తోడుగా వచ్చిన వారిని కూడా టూరిస్ట్ ఒక్కడే చితకబాదేశాడు. వారి సొంతూళ్లోనే వ్యాపారులను వీధుల వెంట పరుగులు పెట్టించాడు. వివరాల్లోకెళితే... ఐర్లాండ్ కు చెందిన ప్రొఫెషనల్ బాక్సర్ మహ్మద్ ఫాదెల్ దొబ్బౌస్ ఇటీవల టర్కీ పర్యటనకు వచ్చాడు. టర్కీ రాజధాని ఇస్తాంబుల్ కు సమీపంలోని అక్సారేలో ఓ చిన్న షాపు వద్దకెళ్లిన దొబ్బౌస్ అక్కడ ఓ వాటర్ బాటిల్ తీసుకుంటున్న క్రమంలో బాటిళ్లన్నీ కిందపడిపోయాయట. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు షాపు ఓనర్ దొబ్బౌస్ పై ఇనుప రాడ్ తో దాడికి దిగాడు. వెనువెంటనే అక్కడి మిగతా షాపుల్లోని వ్యాపారులు కూడా షాప్ ఓనర్ కు మద్దతుగా దొబ్బౌస్ పైకి దండెత్తారు. అయితే తానొక్కడినే కదా అన్న బెరుకు ఏమాత్రం దరిచేరనీయని దొబ్బౌస్ పొజిషన్ తీసుకుని పంచ్ విసిరాడు. వ్యాపారుల గుంపుపై పిడి గుద్దుల వర్షం కురిపించాడు. దొబ్బౌస్ పంచ్ పవర్ కు తట్టుకోలేక వ్యాపారులు వీధుల వెంట పరుగులు పెట్టారట.