: ప్రత్యేక హోదా కోసం టీడీపీ మహిళా నేత కుమారుడు ఉదయభాను ఆత్మహత్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావట్లేదన్న మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలోని శ్రీరామపురంలో ఉదయభాను అనే వ్యక్తి హోదా కోసం తన ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మబలిదానం చేసుకున్నాడు. ఉదయభాను గుడివాడ అర్బన్ తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు తులసీరాణి కుమారుడు. పాలిటెక్నిక్ చదువుకున్న ఉదయభాను, ప్రస్తుతం ఓ రేషన్ షాపు నడుపుతున్నాడు. మరణించే ముందు ప్రత్యేక హోదా కావాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని సూసైడ్ నోట్ రాశాడు. నిరుద్యోగ సమస్య తీరాలని, ఈ లేఖ తన మరణవాంగ్మూలమని రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయభాను మరణంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. హోదా కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.