: "మా అమ్మ ఎంత అందంగా ఉందో" అని మురిసిపోయిన షీనాకు దగ్గరయ్యేందుకు ఇంద్రాణి ఏన్ని ఆశలు చూపిందంటే..!


తల్లి దూరం, తండ్రి ఎవరో తెలియదు. అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పెంపకం. పేద బతుకులు... కన్నతల్లిని కేవలం ఫోటోలో చూస్తూ, "చూడండి, మా అమ్మ ఎంత అందంగా ఉందో" అంటూ స్నేహితుల వద్ద మురిపెంగా చెప్పుకోవడానికి మాత్రమే పరిమితమైన స్థితిలో ఉన్న షీనా బోరాకు, అమ్మ ఇంద్రాణి దగ్గరైంది. బతుకుపై ఎన్నో ఆశలు చూపింది. తప్పు చేశానని బాధపడింది. ఇప్పుడు తాను బాగున్నానని, తనతో రావాలని కోరింది. చదివిస్తానంది. లగ్జరీలు ఆశ చూపి తీసుకెళ్లింది. కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన కన్నబిడ్డను చేతులారా చంపేసింది. ఆమె చిన్ననాటి స్నేహితులు ఇప్పుడు షీనాను గుర్తు చేసుకుంటున్నారు. ఆమెతో పాటు కలసి పెరిగి, చదువుకున్న అర్నబ్ సిక్దర్ షీనాను గుర్తు చేసుకుంటూ, "ఆమె చాలా తెలివిగల అమ్మాయి. ఆర్ట్స్, మ్యూజిక్ అంటే ఆసక్తిని చూపేది. 9, 10 తరగతులకు వచ్చిన తరువాత పరిస్థితి మారిపోయింది. ఆమె నివాసం ఉంటున్న ఇల్లు మారిపోయింది. కొత్త కార్లు వచ్చి చేరాయి. విదేశాలకు టూర్లు వేసింది" అన్నాడు. మధ్యతరగతి బతుకుల్లోకి వచ్చి లగ్జరీలపై ఆశలు చూపిన ఇంద్రాణి, తన కుమార్తెను ముంబై తీసుకెళ్లిందని చెప్పుకొచ్చాడు. షీనా హత్యకేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు, ఆమె హత్య వెనకున్న ఒక్కో విషయాన్నీ వెలుగులోకి తెస్తున్నారు. ఈ కేసులో ఇంకా ఎన్ని అంశాలు వెలుగులోకి వస్తాయో!

  • Loading...

More Telugu News