: షీనా బోరా ఎంత మంచి అమ్మాయంటే...!
సొంత తల్లి, మారు తండ్రి చేతిలో హత్యకు గురైన షీనా బోరా గురించిన మరింత సమాచారం వెలుగులోకి వస్తోంది. ఆమె ముంబైలో ఎకనామిక్స్ చదివిన సెయింట్ జేవియర్స్ కాలేజీ విద్యార్థినులు తమ ఫేస్ బుక్ ఖాతాల ద్వారా షీనా గురించిన వివరాలు, ఆమెతో దిగిన చిత్రాలను పోస్ట్ చేశారు. ఆమె చాలా మంచి అమ్మాయని, చదువు పట్ల ఎప్పుడూ అంకితభావంతో ఉండేదని, అమాయకురాలని, ఎన్నడూ క్లాసులు ఎగ్గొట్టి ఎరుగదని వివరించారు. చిన్న పిల్లల మనస్తత్వాన్ని ప్రదర్శించే షీనా, తనకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని మాత్రమే చెప్పేదని, అంతకు మించిన విషయాలను చర్చించేందుకు ఇష్టపడేది కాదని తెలిపారు. ఎప్పుడూ ఆనందంగా ఉండేందుకు షీనా ప్రయత్నిస్తూ ఉండేదని, ఫ్యాషన్ అంటే ఇష్టమని, స్నేహం చేసింది తక్కువ మందితో అయినా, వారితో బాగా కలిసి పోయిందని పోస్టులు పెట్టారు. ఉద్యోగంలో చేరిన తరువాత పని గంటలు అధికంగా ఉన్నాయని, కొన్ని సమస్యలు వెంటాడుతున్నాయని చెప్పేదని షీనా స్నేహితురాలు ఒకరు తన ఫేస్ బుక్ ఖాతాలో వివరించారు. ఆమె రిలయన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లో రెండేళ్లు ట్రయినీగా పనిచేసిందని, ఆపై ముంబై మెట్రో వన్ లో, అనంతరం రిలయన్స్ అడాగ్ గ్రూప్ లో హెచ్ఆర్ విభాగం అసిస్టెంట్ మేనేజర్ గా కూడా పనిచేసిందని తెలుస్తోంది.