: 22 ఏళ్ల నిరీక్షణకు తెరపడేనా?
శ్రీలంక గడ్డపై భారత క్రికెట్ జట్టు సిరీస్ గెలిచి రెండు దశాబ్దాలు దాటింది. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే, 22 సంవత్సరాలు అయింది. ఇప్పుడా సువర్ణావకాశం భారత్ ముందుంది. ధోనీ నుంచి టెస్టు పగ్గాలు స్వీకరించిన కోహ్లీ, ఇప్పుడు లంక గడ్డపై విజయకేతనం ఎగురవేయాలని తహతహలాడుతున్నాడు. మూడు మ్యాచ్ ల సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తి కాగా, మూడో టెస్ట్ ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. రెండో టెస్టులో సాధించిన ఘన విజయంతో ఊపుమీదున్న కోహ్లీ సేన లంకతో జరిగే ఆఖరి టెస్టులో సైతం గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు శ్రీలంక సైతం తొలి టెస్టు గెలిచిన ఆత్మ విశ్వాసంతో సిరీస్ ను సాధించాలన్న పట్టుదలతో ఉంది. కాగా, 1993లో అజరుద్దీన్ కెప్టెన్సీలో ఇండియా చివరిసారిగా శ్రీలంకలో 1-0తో టెస్టు సిరీస్ విజయం సాధించింది. సుదీర్ఘకాలం తరువాత సంగక్కార లేకుండా లంక ఆడుతున్న తొలి మ్యాచ్ ఇది. దీంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోహ్లీ ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగనుండడంతో, శ్రీలంకతో పోలిస్తే భారత బౌలింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. ఓపెనర్ మురళీ విజయ్, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గాయపడిన నేపథ్యంలో, వారి స్థానాల్లో చటేశ్వర్ పుజారా, నమన్ ఓఝా తుది జట్టులోకి రానున్నట్టు తెలుస్తోంది. లంక జట్టులో ఓపెనర్లు కరుణరత్నె, కౌశల్ సిల్వలు పరుగులు తీయడంలో ఇబ్బంది పడుతుండటం, ఆ జట్టులో ఆందోళనను పెంచుతోంది. సంగక్కార వీడ్కోలు టెస్టులో లంక ఓటమిపాలు కావడంతో మూడో టెస్టులో ఒత్తిడంతా లంకపైనే ఉందని క్రీడా పండితులు వ్యాఖ్యానించారు.