: అతడొద్దు.. భువీని తీసుకోండి: టీమిండియా మేనేజ్ మెంట్ కు సన్నీ సలహా


భారత్, శ్రీలంక జట్ల మధ్య ఆఖరి టెస్టు రేపు (శుక్రవారం) ఆరంభం కానుంది. మూడు టెస్టుల సిరీస్ లో ఇరు జట్లు చెరో టెస్టు నెగ్గడంతో ఇప్పుడు కొలంబో సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరిగే టెస్టు నిర్ణయాత్మకం కానుంది. కాగా, ఈ టెస్టు కోసం టీమిండియా, ఆతిథ్య లంక మెరుగైన ఆటగాళ్లను బరిలో దింపాలని భావిస్తున్నాయి. జట్టు ఎంపికపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ... టీమిండియా ఈ టెస్టులో ఐదుగురు స్పెషలిస్టు బౌలర్లతో బరిలో దిగాలని సూచించారు. ఆల్ రౌండర్ స్టూవర్ట్ బిన్నీ స్థానంలో స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ను తుది జట్టులోకి తీసుకోవాలని సలహా ఇచ్చారు. "సిరీస్ ఫలితం తేల్చే టెస్టు ఇది. గెలవాలనుకుంటే 20 వికెట్లు తీయాల్సిన అవసరం ఉంది. అలా చేయాలంటే భారత్ ఐదుగురు బౌలర్లతో ఆడాల్సిందే. పిచ్ పై కాస్త పచ్చిక ఉంటే భువీని తీసుకునేందుకే నేను మొగ్గు చూపుతా. ఇలాంటి పరిస్థితుల్లో 20 వికెట్లు తీయాలంటే జట్టులో ఓ స్వింగ్ బౌలర్ ఉండాలి. అయితే, స్టూవర్ట్ బిన్నీని తక్కువ చేసి మాట్లాడడంలేదు. కానీ, ఐదు వికెట్లు తీయగల సత్తా ఉన్న బౌలర్ కాదతడు. రెండో టెస్టులో రాణించినా, చొరవగా ముందుకెళ్లలేకపోయాడు" అని వివరించారు.

  • Loading...

More Telugu News