: కేంద్రంపై ఉమ్మడిగా దండెత్తిన ఢిల్లీ, బీహార్ ముఖ్యమంత్రులు


కేంద్రంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఉమ్మడిగా ధ్వజమెత్తారు. కేంద్రం పేదలకు, రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజలు ఇలాంటి కేంద్ర ప్రభుత్వానికి సరైన సమాధానం చెబుతారని స్పష్టం చేశారు. 'మెరుగైన ప్రజా సేవల వ్యవస్థ ద్వారా ప్రజలను సాధికారత దిశగా నడిపించడం ఎలా?' పేరిట పాట్నాలో ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో నితీశ్, కేజ్రీ పాల్గొన్నారు. కేంద్రం చెప్పేదానికి, చేసేదానికి పొంతన లేదని కేజ్రీ విమర్శించారు. "వాళ్లు (బీజేపీ) ఢిల్లీ ఎన్నికల ముందు నన్ను నక్సలైట్ అన్నారు. నా గోత్రాన్ని ప్రశ్నించారు. ఇప్పుడు బీహార్ ప్రజల డీఎన్ఏ ఏంటని అడగడం ద్వారా అదే పొరపాటు చేశారు" అని దుయ్యబట్టారు. నితీశ్ మాట్లాడుతూ... ఇరు రాష్ట్రాల ప్రజలు కలసికట్టుగా కదంతొక్కితే ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా వస్తుంది, బీహార్ కు ప్రత్యేక హోదా లభిస్తుంది అని అన్నారు. ఈ దిశగా సాధనలో ఎన్నో అడ్డంకులు ఉన్నా అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జీడీపీలో ఒక్క శాతాన్ని బీహార్ కు ప్రత్యేక ప్యాకేజీగా ఇస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించినా, కేంద్ర ఆర్థిక శాఖ దీని గురించిన ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. ఇంతకుమించి మాట్లాడడానికి ఇది సరైన వేదిక కాదని నితీశ్ ముక్తాయించారు.

  • Loading...

More Telugu News