: ఎవరూ అఘాయిత్యాలకు పాల్పడొద్దు... ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం: చంద్రబాబు
ప్రత్యేక హోదాపై ఏపీలో జరుగుతున్న ఆత్మహత్యలపై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరూ అధైర్యపడొద్దని, అఘాయిత్యాలకు పాల్పడొద్దని కోరారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను ప్రతిక్షణం పోరాడుతున్నానని చెప్పారు. తాను ఏది చేసినా భవిష్యత్ తరాల ప్రయోజనాల కోసమేనని వివరించారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని బాబు స్పష్టం చేశారు. తనపై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలకు విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. ఢిల్లీలో ధర్నా చేసిన ఓ నేతకు ప్రధాని వద్దకు వెళ్లి సమస్య గురించి చెప్పే ధైర్యం లేదని జగన్ పై పరోక్షంగా మండిపడ్డారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటన వివరాలను వెల్లడించారు. ప్రధానితో గంటన్నరసేపు సమావేశమయ్యానని, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఇంకా నష్టపోతామని ప్రధానికి చెప్పానన్నారు. విభజన చట్టంలో పెట్టిన అంశాలు ప్రధాని, ఆర్థిక మంత్రికి వివరించానన్నారు. సమస్య పరిష్కారమయ్యేవరకూ ప్రయత్నం చేస్తూనే ఉంటామని, సమస్యలు అధిగమించేవరకూ కార్యక్రమాలు రూపొందించామని తెలిపారు.