: రోజుకో మలుపు తిరుగుతున్న హై ప్రొఫైల్ మర్డర్ మిస్టరీ!


ఎన్నో మర్డర్ మిస్టరీ సినిమాలు చూసివుంటాం. వాటన్నిటికన్నా మించిన స్టోరీ జరుగుతోంది. భారత కార్పొరేట్ రంగంలో హై ప్రొఫైల్ మర్డర్ గా నిలిచి రోజుకో మలుపు తిరుగుతున్న షీనా బోరా హత్య కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంద్రాణికి ఇద్దరు భర్తలు కాదని, ముగ్గురు భర్తలున్నారని, రెండుసార్లు వివాహమైన విషయాన్ని దాచి పీటర్ ముఖర్జియాను వివాహం చేసుకుందని ముంబై పోలీసులు స్పష్టం చేశారు. ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా కన్నా ముందు సిద్ధార్థ దాస్ అనే వ్యక్తితో కొంత కాలం గడిపింది. అతనికి పుట్టిన కూతురే షీనా. ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకున్న ఇంద్రాణి, పీటర్ తో కలిసున్న సమయంలో సంజీవ్ ఖన్నాతో కూడా బంధం నడిపిందని, వీరిద్దరూ కలసే షీనాను దగ్గరుండి హత్య చేయించారని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. షీనా బోరా... ఏప్రిల్ 24, 2012న హత్యకు గురైంది. పెట్రోలు పోసి తగులబెట్టగా, గుర్తు పట్టలేని స్థితిలో, ఆపై నెల రోజులకు... అంటే, మే 23న రాయగఢ్ వాసులకు కనిపించింది. ఆమె గురించిన సమాచారం లేకపోవడం, ఎక్కడా మిస్సింగ్ కేసులు పెండింగ్ లో కనిపించకపోవడంతో పోలీసులు కేసును పక్కన పెట్టేశారు. 2012లోనే పక్కన పెట్టేసిన కేసు ఇప్పుడెలా బయటకు వచ్చిందో తెలుసా? ఈ నెల 21న పోలీసులు తనిఖీలు చేస్తున్న వేళ ముఖర్జియా కారు డ్రైవర్ రాయ్ 7.62 ఎంఎం లోడెడ్ ఫిస్టల్ తో పట్టుబడ్డాడు. ఆయుధానికి లైసెన్స్ లేకపోవడం, అడిగిన ప్రశ్నలకు తడబడుతూ సమాధానాలు చెప్పడంతో, పోలీసులకు అనుమానం వచ్చింది. తమదైన శైలిలో విచారిస్తే, మొత్తం కథ చెప్పేశాడు. దీంతో షీనా మృతదేహాన్ని తగులబెట్టిన ప్రాంతానికి రాయ్ ని తీసుకెళ్లిన పోలీసులు మూడేళ్ల నాటి కేసును తిరగదోడారు. చనిపోయింది షీనా అని తేల్చిన పోలీసులు ఇంద్రాణి, సంజీవ్ లను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి ఈ కేసును పరువు హత్యగా భావిస్తున్నామని, హత్య వెనుక అసలు ఉద్దేశాలను కనుగొంటామని ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా వివరించారు. ఇదిలావుండగా, ఇంద్రాణికి మిఖాయిల్ అనే కుమారుడు కూడా ఉన్నట్టు తాజాగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇంద్రాణి తల్లిదండ్రుల వద్ద ఉన్న మిఖాయిల్, అక్క షీనాను తన తల్లి ఎందుకు చంపిందో తనకు తెలుసునని, ఇటీవలి మీడియా వార్తలతో ఆవేదన కలుగుతోందని చెబుతున్నాడు. తనను 'అమ్మ' అని పిలవనే వద్దని కఠినంగా చెప్పేదని, షీనాను ఆమే వచ్చి ముంబై తీసుకెళ్లిందని చెప్పాడు. "నా సోదరిని, మా అమ్మ తన చెల్లిగా పరిచయం చేయడం దిగ్ర్భాంతిని కలిగిస్తోంది. ఆమె మొదటి నుంచి అబద్ధాలే చెపుతూ ఉండొచ్చు. మీడియాలో వస్తున్న వార్తలు వేరు, అసలు నిజం వేరు" అని మిఖాయిల్ తెలియజేశాడు. తొలుత తన పోషణకు ముంబై నుంచి డబ్బు పంపిన తల్లి, ఆ తరువాత మానేసిందని వివరించాడు. ఈ హై ప్రొఫైల్ మర్డర్ మిస్టరీలో మరింకెన్ని 'పచ్చి నిజాలు' వెలుగులోకి వస్తాయో?!

  • Loading...

More Telugu News