: గంగూలీ, సచిన్ లను అధిగమించిన ఏబీ డివిలియర్స్
సౌత్ ఆఫ్రికా క్రికెట్ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ అరుదైన ఘనత సాధించారు. అతి తక్కువ వన్డే ఇన్నింగ్స్ లలో 8వేల పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్ మెన్ గా ఏబీ అవతరించాడు. నిన్న న్యూజిలాండ్ తో జరిగిన చివరి వన్డేలో హాఫ్ సెంచరీ (64) సాధించిన సందర్భంగా ఏబీ ఈ రికార్డును సాధించాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీలను అధిగమించాడు. 8వేల పరుగుల మైలు రాయిని అందుకోవడానికి డివిలియర్స్ కు కేవలం 182 ఇన్నింగ్స్ మాత్రమే పట్టింది. అంతకు ముందు ఈ రికార్డ్ భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (200 ఇన్నింగ్స్) పేరిట ఉంది. సచిన్ ఈ ఫీట్ ను 210 ఇన్నింగ్స్ లలో సాధించాడు. మరోవైపు, ఇప్పటికే వన్డే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ, ఫాస్టెస్ట్ సెంచరీ, ఫాస్టెస్ట్ 150 రన్స్ రికార్డులు కూడా డివిలియర్స్ పేరిటే ఉన్న సంగతి తెలిసిందే.