: రాత్రుళ్లు సుఖంగా నిద్రపోవాలంటే... ఇలా చేయాలి!
రాత్రిపూట సంతృప్తికరంగా నిద్రరాకుంటే, మరుసటి రోజు ఉదయం ఉండే అసౌకర్యం అంతా ఇంతా కాదు. ఏ పనీ చేయబుద్ధి కాదు. బద్ధకంగా ఉంటుంది. ఏవో ఆలోచనలు వస్తుంటాయి. ఫలితంగా పనితీరు దెబ్బతింటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఇంటి ముంగిట్లో, పడకగదిలో పచ్చదనాన్ని పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం... * మత్తెక్కే సువాసనను కలిగించే మల్లెల పరిమళం ముక్కును తాకుతూ ఉంటే సుఖంగా నిద్రపడుతుంది. అందువల్ల పడకగది కిటికీలకు దగ్గరగా మల్లెతీగలు ఉండేలా చూసుకోవాలి. దీంతో పాటు కలబంద, స్నేక్ ప్లాంట్ వంటివి గదిలో ఉంచితే, రాత్రిళ్లు కార్బన్ డయాక్సైడ్ స్థాయి తగ్గి ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. * గార్డెనియా మొక్కలు నాటడం వల్ల కూడా హాయిగా నిద్రించవచ్చు. వాడిపోని ఆకులు, ఆకర్షణీయంగా కనిపించే పూలతో ఉండే గార్డెనియా మొక్కలను కిటికీ బయట నాటాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటితో పాటు స్పైడర్ ప్లాంట్స్ ఉంటే, క్యాన్సర్ కారక రసాయనాలు తగ్గుతాయి. ఈ మొక్క దుర్వాసనను తగ్గించి గదిని ఆహ్లాదంగా మార్చేలా చేస్తుంది. * ఇక పీస్ లిల్లీ... హాని కలిగించే వ్యర్థాలను గాలి నుంచి తీసివేసి స్వచ్ఛత నిండిన గాలిని పెంచుతుంది. పచ్చని ఆకులు, తెల్లని పూలతో ఉంటూ ఆకట్టుకునే ఈ మొక్కను చూస్తూ ఉన్నా హాయిగా నిద్రవచ్చేస్తుంది. బాగా నిద్రపోతే, మరుసటి రోజు ఎంత ఆనందంగా ఉంటుందో తెలిసిందేగా!