: భూమండలానికి ముంచుకొస్తున్న ముప్పు... కొన్నేళ్లకు ఫ్లోరిడా, సింగపూర్, టోక్యోలు కనిపించవు: నాసా
వచ్చే 100 నుంచి 200 సంవత్సరాల వ్యవధిలో సముద్రమట్టం 3 అడుగుల మేరకు పెరగనుందని, భూమండలం అధిగమించలేని అతిపెద్ద ప్రమాదాల్లో ఇదొకటని నాసా సైంటిస్టులు వెల్లడించారు. తాజా శాటిలైట్ గణాంకాల మేరకు సముద్రమట్టం సుమారు మీటరు పెరగనున్నదని, గ్రీన్ ల్యాండ్, అంటార్కిటికాల్లో మంచుదిబ్బలు శరవేగంగా కరుగుతుండటమే ఇందుకు కారణమని నాసా ఎర్త్ సైన్స్ డివిజన్ డైరెక్టర్ మైఖేల్ ఫెర్లిచ్ వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడున్న సముద్రమట్టానికి ఒక మీటరు ఎత్తులో 15 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారని, వారందరూ మరో ప్రాంతానికి తరలాల్సిందేనని తెలిపారు. అమెరికాలోని ఫ్లోరిడాతో బాటు, సింగపూర్, టోక్యో తదితర నగరాలు సుముద్రంలో కలసిపోతాయని, కొన్ని పసిఫిక్ ద్వీపాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయని ఆయన వివరించారు. పర్యావరణ పరిరక్షణ చర్యలు విస్తృతంగా చేపడితే, ఈ ప్రమాదాన్ని మరికొంత కాలం వాయిదా వేయవచ్చని అంచనా వేశారు.