: వైసీపీ నేత ఫంక్షన్ హాల్ లో టీడీపీ యువ ఎమ్మెల్యే పెళ్లి... హాజరుకానున్న చంద్రబాబు
నిజమేనండోయ్, టీడీపీకి చెందిన యువ ఎమ్మెల్యే పెళ్లికి వైసీపీ నేతకు చెందిన ఫంక్షన్ హాల్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ వివాహ వేడుకకు ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. వివరాల్లోకెళితే... చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని సత్యవేడు ఎమ్మెల్యే ఆదిత్య వివాహం నేడు తిరుపతిలో జరగనుంది. అదే జిల్లాలోని పుంగనూరు ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత పెద్దరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పీఎల్ఆర్ కన్వెన్షన్ హాల్ లో ఈ వివాహం జరగనుంది. ఎస్సీ రిజర్వ్ డ్ నియోజకవర్గం సత్యవేడు నుంచి ఆదిత్య మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో అత్యంత పిన్న వయస్కుడైన ఆదిత్యకు ఇంకా పెళ్లి కాలేదు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఆయనకు వివాహం కుదిరింది. నేటి సాయంత్రం 6 గంటలకు తిరుపతిలో అంగరంగవైభవంగా జరగనున్న ఈ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు చంద్రబాబు విజయవాడ నుంచి వస్తున్నారు. చంద్రబాబుతో పాటు టీడీపీకి చెందిన పలువురు నేతలు, మంత్రులు కూడా ఈ వివాహానికి హాజరుకానున్నారు.