: థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్న ఇంద్రాణి ముఖర్జియా కేసు
షీనా బోరా హత్యకేసు బాలీవుడ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. షీనా బోరా హత్య కేసులో నిన్న రాత్రి అరెస్టైన 'స్టార్ ఇండియా' మాజీ సీఈవో పీటర్ ముఖర్జియా భార్య ఇంద్రాణి ముఖర్జియా మాజీ భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీటర్ ముఖర్జియాతో వివాహానికి ముందు ఇంద్రాణికి సంజీవ్ ఖన్నాతో వివాహం జరిగింది. సంజీవ్ ఖన్నా ద్వారా ఇంద్రాణి ముఖర్జియాకి షీనా బోరా జన్మించింది. పీటర్ ముఖర్జియాతో వివాహం తరువాత ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఇంద్రాణి, కుమార్తెను సోదరిగా పరిచయం చేసింది. వరుస తెలియని పీటర్ ముఖర్జియా కుమారుడు షీనాతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ ప్రేమలో ఉండడంతో, ఆగ్రహించిన ఇంద్రాణి, కుమార్తెను కారు డ్రైవర్ తో హత్య చేయించింది. ఇది ఇప్పటి వరకు పోలీసుల విచారణ సందర్భంగా వెల్లడైన విషయం. ఇంద్రాణి చెప్పింది నిజమా? లేక ఇంకేదైనా కోణముందా? అనేది విచారించేందుకు ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నాను ముంబై పోలీసులు కోల్ కతాలో అదుపులోకి తీసుకున్నారు. ఆయనను విచారిస్తున్నారు. కాగా, ఇంద్రాణి ఇవేవీ తనకు చెప్పలేదని ఆమె ప్రస్తుత భర్త పీటర్ ముఖర్జియా వాపోతున్నారు.