: 'శిశువు మృతి'పై కామినేని ఫైర్... శానిటేషన్ కాంట్రాక్టర్ తొలగింపు, ఆర్ఎంఓపై సస్పెన్షన్ వేటు
గుంటూరు జీజీహెచ్ లో ఓ శిశువు ఎలుకల దాడిలో ప్రాణాలు విడవడం ఏపీ వైద్య, ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ కు ఆగ్రహం తెప్పించింది. మంత్రివర్గ సహచరులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులతో కలిసి ఆయన ఆసుపత్రిలో తనిఖీలు చేశారు. ఆసుపత్రి పరిస్థితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆయన అధికారులపై మండిపడ్డారు. ఆసుపత్రి అధికారుల పాలనాపరమైన నిర్లక్ష్యం కారణంగానే శిశువు మరణించాడని స్పష్టం చేశారు. ఈ ఘటనలో శానిటేషన్ కాంట్రాక్టర్ ను తొలగిస్తున్నట్టు పేర్కొన్న కామినేని, ఆసుపత్రి ఆర్ఎంఓను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో న్యాయవిచారణకు ఆదేశించినట్టు తెలిపారు. ఘటనపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో వారంలోగా నివేదిక ఇవ్వాలని పోలీసులను కోరినట్టు ఆయన చెప్పారు. అంతేగాకుండా, బాలుడి మృతిపై శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశించినట్టు వివరించారు. బాలుడి మృతి అత్యంత బాధాకరం అని, విషాదకరం అని మంత్రి పేర్కొన్నారు. తీవ్రగాయాలపాలైన ఆ బాలుడికి వైద్యులు అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ నిర్వహించినా ప్రయోజనం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.