: కొచి తీరం చేరుతుండగా పడవ ప్రమాదం...ఎనిమిది మంది మృతి
కేరళలోని కొచి ఫోర్ట్ సముద్ర తీరంలో ఘోర పడవ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. 30 మంది ప్రయాణికులతో వైపిన్ ద్వీపం నుంచి కొచికి బయల్దేరిన నావ కొద్ది సేపట్లో తీరానికి చేరుకుంటుందనగా, చేపల వేటకు ఉపయోగించే పడవ ఢీ కొట్టింది. దీంతో ఎనిమిది మంది మృతి చెందగా, 20 మంది గాయాలతో బతికి బయటపడ్డారు. ప్రమాదం సంగతి తెలియగానే తీర రక్షక దళం, నౌకాదళం, స్థానిక పోలీసులు, స్థానిక జాలర్లు వేగంగా స్పందించారు. సహాయక చర్యలు అందించేందుకు ప్రమాద ఘటనా స్థలికి చేరుకున్నారు. మిగిలిన ఇద్దరి కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. సహాయక చర్యలకోసం నౌకాదళం చేతక్ హెలికాప్టర్లను రంగంలోకి దించింది.