: అమ్మాయిలను మోసం చేశాడన్న ఆరోపణలతో సినీ సంగీత దర్శకుడి అరెస్టు


ప్రముఖ సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు శిష్యుడిగా చెప్పుకుంటున్న వర్ధమాన సినీ సంగీత దర్శకుడ్ని తణుకు పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే... '1940లో ఒక గ్రామం' సినిమాకు సంగీత దర్శకత్వం వహించిన సాకేత్ సాయిరాం మైనర్ బాలికను కిడ్నాప్ చేశాడన్న ఆరోపణలతో అరెస్టయ్యాడు. కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన సాకేత్ సాయిరాం అలియాస్ షేక్ సయ్యద్ హుస్సేన్ అలీ వివిధ భాషల్లో 17 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. హైదరాబాదులో స్థిరపడిన సాకేత్ గత మే 22న ఉండ్రాజవరం దగ్గర పాలంగిలో జరిగిన మిత్రుడి వివాహానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా మరో మిత్రుడి 15 ఏళ్ల కుమార్తెకు మాయమాటలు చెప్పి కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఆమెను హైదరాబాదు తీసుకెళ్లిపోయాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు కుమార్తె తప్పిపోయిందని భావించి, ఆమె కోసం వెతికారు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తుండగా బాలిక కాట్రేనికోనలో ఉన్న తల్లిదండ్రులను చేరింది. అంతా సర్దుకుందనుకుంటున్నంతలో కాట్రేనికోన వచ్చిన సాకేత్ సాయిరాం మరోసారి బాలికను ఎత్తుకెళ్లిపోయాడు. బాలికను కొన్నాళ్లు లాడ్జ్ లో ఉంచిన సాకేత్, ఆ తరువాత మిత్రుడు కిరణ్ ఇంట్లో దాచిపెట్టాడు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు సాకేత్ ను అదుపులోకి తీసుకుని, బాలికను విడిపించారు. తనను కిడ్నాప్ చేసినట్టు బాలిక చెప్పడంతో, పోలీసులు అతనిని న్యాయస్థానంలో హాజరుపరిచారు. దీంతో న్యాయస్థానం 15 రోజుల రిమాండ్ విధించింది. సినిమాల్లో అవకాశం ఇస్తానని గతంలో చాలా మంది యువతులను నమ్మించి మోసం చేశాడని సాకేత్ సాయిరాంపై ఆరోపణలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News