: సల్మాన్ సినిమాలో నటిస్తోంది...షారూఖ్ అంటే ఇష్టమంటోంది!
బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ మధ్య అభిప్రాయ భేదాలు ఉన్న విషయం సినీ అభిమానులకు తెలిసిందే. షారూఖ్ సరసన నటించిన దీపికా పదుకునే, అనుష్కా శర్మ వంటి నటీనటులతో సల్మాన్ నటించలేదు. అలాగే సల్మాన్ సరసన నటించిన కొంతమంది హీరోయిన్లతో షారూఖ్ నటించలేదు. దీంతో వీరిద్దరూ ఒకరిపై ఒకరు మాట్లాడుకున్నా, కామెంట్లు చేసుకున్నా, కలుసుకున్నా విశేషమే. సల్మాన్ తో ఉండే వాళ్లు, షారూఖ్ గురించి మాట్లాడరు, షారూఖ్ తో ఉండే వాళ్లు సల్మాన్ గురించి మాట్లాడరు. ఈ నేపథ్యంలో ఓ వర్ధమాన నటి ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సినిమాలో నటిస్తూ షారూఖ్ అంటే ఇష్టమంటోంది. సునీల్ శెట్టి కుమార్తె అథియా శెట్టి సల్లూభాయ్ నిర్మిస్తున్న 'హీరో' సినిమా ద్వారా తెరంగేట్రం చేస్తోంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ, తనకు షారూఖ్ అంటే ఇష్టమని చెప్పింది. తాను చిన్నప్పుడు 'మై హూ నా' షూటింగ్ చూసేందుకు వెళ్తే, షూటింగ్ మొత్తం తిప్పి చూపించాడని, ఆ రోజంతా షారూఖ్ తో సంతోషంగా గడిపానని చెప్పింది. అందరు హీరోయిన్లలాగే తాను కూడా ముగ్గురు ఖాన్ లతో నటించాలని కోరుకుంటున్నానని చెప్పింది. అవకాశం వస్తే తన తండ్రితో కూడా నటించేందుకు సిద్ధమని అథియా శెట్టి వెల్లడించింది.