: సోదరుడితో డేటింగ్ చేసినందునే షీనాను హత్య చేయించిన తల్లి: పీటర్ ముఖర్జియా
స్టార్ ఇండియా మాజీ సీఈఓ పీటర్ ముఖర్జియా భార్య ఇంద్రాణి అరెస్ట్ వెనుక సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మూడేళ్ల క్రితం హత్యకు గురైన షీనా ఇంద్రాణికి సోదరి అని ఇంతవరకూ భావిస్తూ రాగా, ఇప్పుడామె ఇంద్రాణి కూతురన్న పచ్చినిజం వెల్లడైంది. షీనా ఇంద్రాణికి కూతురన్న సంగతి తనకు ఇప్పుడు మాత్రమే తెలిసిందని పీటర్ ముఖర్జియా వ్యాఖ్యానించారు. ఆమె చనిపోయిందన్న విషయం తనకు తెలియదని, అమెరికాలో చదువుకుంటోందని మాత్రమే తెలుసునని ఆయన అన్నారు. షీనా తనకు వరుసకు సోదరుడయ్యే తన కుమారుడితో డేటింగ్ చేసిందని, అది ఇంద్రాణికి నచ్చేది కాదని, అందువల్లే ఆమె హత్యకు ప్రేరేపించి ఉండవచ్చని తెలిపారు. కాగా, ఇంద్రాణి ఆదేశాల మేరకే తాను షీనాను హత్య చేసినట్టు వారి కారు డ్రైవర్ అంగీకరించడంతో ఆమెను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఇంద్రాణికి మొదటి భర్తతో కలిగిన కుమార్తె షీనా కాగా, పీటర్ ముఖర్జియా మొదటి భార్య సంతానంగా ఓ కుమారుడు ఉన్నారు. పీటర్, ఇంద్రాణిల వివాహం తరువాత వరుసకు అన్నా చెల్లెళ్లయిన వీరిద్దరి మధ్యా డేటింగ్ జరుగుతుండటంతోనే ఇంద్రాణి పరువు హత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు.