: ఈ 'ప్యాకేజీ'... పెళ్లి కాకుండానే కాపురం చేయమన్నట్టుంది... చెప్పుతో కొడతారు: ఉండవల్లి నిప్పులు
ముందుగా హామీ ఇచ్చిన విధంగా ప్రత్యేక హోదాను ప్రకటించకుండా, అంతే మొత్తంలో ప్యాకేజీ ఇస్తామని చెప్పడంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. "నిశ్చితార్థం చేసుకున్న తరువాత, మాకు పెళ్లి అచ్చిరాదు. అమ్మాయిని కాపురానికి పంపండి. పెళ్లి అయితే ఏం సౌకర్యాలుంటాయో... అన్నీ ఇస్తాం, అలానే చూసుకుంటాం అంటే ఊరుకుంటారా? చెప్పు తీసుకొని కొడతారు. ఈ ప్యాకేజీ కూడా అటువంటిదే" అని దుయ్యబట్టారు. ఈ సాయంత్రం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. విభజన బిల్లు సమయంలో ఒక మాట మాట్లాడిన తెలుగుదేశం నేతలు, నేడు బీజేపీతో ఉన్న అవసరాలను తీర్చుకునేందుకు మరో మాట మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. అసలు ప్రత్యేక హోదా పేరు చెప్పే తెలుగుదేశం-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు దాన్ని మరిస్తే ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాష్ట్ర భవిష్యత్తును, పరువు ప్రతిష్ఠలనూ బాబు సర్కారు బీజేపీ కాళ్ల ముందు తాకట్టు పెట్టిందని ఉండవల్లి విమర్శించారు.