: బుల్ మార్కెట్ కు ముగింపా? లేక సంపద సృష్టికి తొలి అడుగా?


గడచిన వారం రోజుల వ్యవధిలో భారత్ సహా ప్రపంచ మార్కెట్లు కుప్పకూలాయి. అనిశ్చిత స్థితిలో ఉన్న చైనా ఆర్థిక వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులపై ప్రభావం చూపగా, ఇప్పుడు మరో కొత్త భయం నెలకొంది. అదే అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య కరెన్సీ యుద్ధం. ఈ ప్రపంచ మార్కెట్ల పతనం 8 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ. 65 లక్షల కోట్లు) ఇన్వెస్టర్ల సంపదను హరించి వేసింది. ఇది 1998 నాటి ఆసియా కష్టాలను గుర్తుకు తెస్తూ, పలు దేశాల కరెన్సీలు పతనమయ్యాయి. పరిస్థితిని చక్కబరిచి, ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని నిలిపేందుకు ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ రంగంలోకి దిగి, ఈ పతనం తాత్కాలికమేనని, భారత ఇన్వెస్టర్లకు ఆందోళన అవసరం లేదని అనునయించినా, అది ఒక్కరోజుకే పరిమితమైంది. ఈనెల 11న చైనా తన కరెన్సీ యువాన్ విలువను తగ్గించగా, అప్పటి నుంచి సమస్య మొదలైంది. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో చైనా షాంగై కాంపోజిట్ సూచిక 26 శాతం పడిపోగా, అదే దారిలో ఆసియా మార్కెట్లన్నీ పయనించాల్సి వచ్చింది. జపాన్ నిక్కీ 10 శాతం, హాంకాంగ్ సూచి హ్యాంగ్ సెంగ్ 11 శాతం, సెన్సెక్స్ 7 శాతం దిగజారాయి. అమెరికన్ సూచి డౌజోన్స్ 10 శాతం పడిపోయింది. ఇండియాలో బుల్ మార్కెట్ కొనసాగుతుందని చెప్పేందుకు కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 4.7 శాతంగా ఉన్న ద్రవ్యలోటు, 2015-16 నాటికి 1.3 శాతానికి దిగివచ్చింది. చాలాకాలం పాటు 9 శాతం వద్ద కదలాడిన కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సరాసరి గడచిన జూలైలో 3.8 శాతానికి చేరింది. రికార్డు స్థాయిలో 354.4 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు పోగయ్యాయి. ఇవన్నీ మార్కెట్ కు సానుకూలాంశాలే. దీర్ఘకాలంలో అత్యధిక సంపదను సృష్టించేలా భారత్ లో పరిస్థితి ఏర్పడుతోందని రిలయన్స్ కాపిటల్ అంచనా వేస్తోంది. ఈ మార్కెట్ల పతనం కొత్త ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోందని అభిప్రాయపడింది. నిఫ్టీ సూచిక 7,800 పాయింట్లకు తగ్గినప్పటికీ, గడచిన రెండేళ్లలో 50 నుంచి 60 శాతం వరకూ వృద్ధిని నమోదు చేసిందన్న విషయాన్ని మరువరాదని ఆర్ కాపిటల్ ప్రతినిధి మధుసూధన్ కేలా వ్యాఖ్యానించారు. ఓ రెండు నెలలు ఒడిదుడుకులు నమోదైనా, ఆ తరువాత భారీ లాభాల దిశగా సూచికలు సాగుతాయని భావిస్తున్నట్టు తెలిపారు. ప్రపంచ పరిణామాలు తాత్కాలికంగా మాత్రమే ఇండియాపై ప్రభావం చూపగలుగుతాయని, దీర్ఘకాలంలో కాదని ఆయన అన్నారు. ఈక్విటీల్లో పెట్టుబడులను క్రమానుగుణంగా పెంచుకునేందుకు మంచి అవకాశం లభించనుందని పీర్ లెస్ ఫండ్స్ మేనేజ్ మెంట్ ఈక్విటీ విభాగం హెడ్ అమిత్ నిగమ్ వివరించారు. సంపద సృష్టికి 100 కంపెనీలను ఎంచుకోవాల్సిన అవసరం లేదని, ఫండమెంటల్స్ బాగున్న 15-16 కంపెనీలను పట్టుకుంటే చాలని మోతీలాల్ ఓస్వాల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రామ్ దేవ్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. ఎంచుకున్న వాటిల్లో మూడోవంతు నష్టాలను మిగిల్చినా, ప్రమాదం ఉండదని ఆయన తెలియజేశారు.

  • Loading...

More Telugu News