: నాపై పెట్టినవన్నీ అక్రమ కేసులే... భయపడే ప్రసక్తే లేదన్న జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనపై పెట్టిన కేసులకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ కు నిరసనగా విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయం ముందు నేటి ఉదయం దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడి వైఖరిపై నిప్పులు చెరిగారు. తనపై పెట్టినవన్నీ అక్రమ కేసులేనని ఆయన వ్యాఖ్యానించారు. తనపై కేసులు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికే భయపడని తాను ప్రస్తుత ప్రభుత్వానికి ఎందుకు భయపడతానని ప్రశ్నించారు. కేసులకు ఏమాత్రం బెదిరేది లేదని కూడా ఆయన తేల్చిచెప్పారు. ఇక ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్ర మోదీ వద్ద ఏపీ హక్కులను తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు.