: జగన్ హెచ్చరికలతోనే చంద్రబాబులో చలనం... వైసీపీ నేత రోజా వ్యాఖ్య
ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరికలతోనే ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిలో చలనం కనిపిస్తోందని వైసీపీ ఎమెల్యే రోజా అన్నారు. నవ్యాంధ్ర రాజధాని భూమి కోసం ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ కు నిరసనగా విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయం ముందు జగన్ నేటి ఉదయం దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ఈ దీక్షలో పాల్గొన్న సందర్భంగా రోజా మాట్లాడుతూ చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు గుప్పించారు. 14 నెలలుగా తాము చంద్రబాబు లాంటి సీఎం పాలనలో ఉండటం మన దౌర్భాగ్యం అని ప్రజలు బాధపడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికుల సమ్మెపై స్పందించిన జగన్, సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనకు దిగుతానని హెచ్చరించిన తర్వాతే చంద్రబాబు ప్రభుత్వం ఆ సమస్యలను పరిష్కరించిందని ఆమె గుర్తు చేశారు. భూసేకరణపై అంతెత్తున ఎగిరిపడ్డ జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాగార్జున వర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యపై ఎందుకు స్పందించలేదని ఆమె ప్రశ్నించారు.