: భారత ఆర్థిక మూలాలు బలమైనవే... విదేశీయులు దూరమైతే మాత్రం పెను ఇబ్బందులే!


చాలా దేశాల స్టాక్ మార్కెట్లతో పోలిస్తే, భారత్ బలమైన మూలాలతో ఉన్నప్పటికీ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగితే మాత్రం తట్టుకుని నిలిచే పరిస్థితి లేదని నిపుణులు భావిస్తున్నారు. చైనా భయాలతో ఇండియన్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడులను వెనక్కు తీసుకునేందుకు ఎఫ్ఐఐ (ఫారిన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్)లు ముందుకు వచ్చి, డాలర్ తో రూపాయి మారకపు విలువ పతనమవుతూ ఉంటే, పెను ఇబ్బందులు తప్పవని అంచనా వేస్తున్నారు. సరిగ్గా రెండు రోజుల క్రితం ఇదే జరిగింది. చైనా కరెన్సీ విలువ తగ్గింపు తరువాత, రూపాయి పతనం, ఎఫ్ఐఐల్లో ఆందోళనలను పెంచగా, వారు భారత మార్కెట్లలో ఈక్విటీలను అమ్మి లాభాలను స్వీకరించేందుకే మొగ్గు చూపారు. వారి అమ్మకాల కారణంగా మార్కెట్లు నష్టపోతుంటే, అదే దారిలో దేశీయ ఇన్వెస్టర్లు, ఫండ్ సంస్థలు సైతం నడవక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. అందువల్లే స్టాక్ మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేనంతటి పతనం నమోదైంది. గడచిన బుధవారం నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 10,700 కోట్ల విలువైన షేర్లను అమ్మేసుకుపోయారు. జనవరి 2008 తరువాత ఐదు సెషన్ల వ్యవధిలో ఇంత ఎక్కువ మొత్తాన్ని విదేశీయులు వెనక్కు తీసుకోవడం ఇదే తొలిసారి. ఈ నెలలో ఇంతవరకూ రూ. 11,240 కోట్ల విలువైన వాటాలను ఇన్వెస్టర్లు విక్రయించారు. అక్టోబర్ 2008 తరువాత ఇదే అత్యధికం. చైనాతో పోలిస్తే వివిధ రేటింగ్ సంస్థలు భారత్ పై తమ దృక్పథాన్ని మెరుగైన స్థితిలో ఉంచినప్పటికీ, అంతర్జాతీయ స్థాయి పరిణామాలు చూపే ప్రభావం ఇండియాపై అధికమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యువాన్ పతనం తరువాత, ఆ దేశంలో ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు చేస్తున్న అన్ని దేశాల కరెన్సీలు పతనంకాగా, రూపాయి విలువ రోజుల వ్యవధిలో 4 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. బీఎస్ఈ గణాంకాల ప్రకారం సోమవారం నాడు దేశవాళీ ఇన్వెస్టర్లు రూ. 5,200 కోట్ల విలువైన వాటాలను విక్రయించారు. ఇక మంగళవారం నాడు విదేశీ ఇన్వెస్టర్లు వాటాలను విక్రయిస్తుంటే, దేశవాళీ పెట్టుబడిదారులు వాటిని సొంతం చేసుకున్నారు. అందువల్లే భారీ నష్టాల నుంచి కూడా మార్కెట్ తేరుకుంది. మరోసారి విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలకు దిగితే, కొనేవారు ఉండే అవకాశాలు తక్కువే. ఇదే జరిగితే మార్కెట్ మరో భారీ పతనాన్ని నమోదు చేస్తుంది.

  • Loading...

More Telugu News