: ముందుంది మొసళ్ల పండుగ!... దేశాన్ని కుదిపేయనున్న విద్యుత్ ‘మిగులు’ సమస్య


దేశంలో విద్యుత్ కాంతులు ప్రసరించని ప్రాంతం ఉండరాదన్నదే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పం. ఇదే సంకల్పం ప్రస్తుతం దేశాన్ని భారీ కుదుపునకు గురిచేయనుందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దేశంలో విద్యుత్ సరఫరా లేని మారుమూల ప్రాంతాలు చాలానే ఉన్నాయి. వాటన్నింటికీ విద్యుత్ సరఫరా చేసేందుకు కొత్తగా దేశంలో లెక్కలేనన్ని విద్యుదుత్పత్తి సంస్థలు వెలిశాయి. కొన్ని ఇప్పటికే విద్యుదుత్పత్తిని ప్రారంభించగా, మరికొన్ని త్వరలో ఉత్పత్తి ప్రారంభించనున్నాయి. అయితే ఈ ఉత్పత్తి వేగాన్ని డిమాండ్ అందుకోవడం లేదు. ఉదాహరణకు గడచిన రెండేళ్లలో దేశంలో కొత్తగా 40 వేల మెగావాట్ల విద్యుత్ కొత్తగా అందుబాటులో రాగా, డిమాండ్ మాత్రం 10 వేల మెగావాట్లకు మాత్రమే పెరిగింది. మారుమూల పల్లెలకు విద్యుత్ సరఫరా ఖర్చుతో కూడుకున్న పని. వ్యయప్రయాసలకోర్చి అక్కడికి విద్యుత్ లైన్లు వేసినా, నియంత్రణ ఖర్చు తడిసిమోపెడు కానుంది. దీంతో ప్రస్తుతం రూ.4 నుంచి 6కు దొరుకుతున్న యూనిట్ విద్యుత్ రూ.10 లకు పెరగనుంది. దీంతో విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసినా మారుమూల పల్లెల్లో విద్యుత్ ను కొనుగోలు చేసే నాథుడే ఉండడంటున్నారు నిపుణులు. ఇక విద్యుత్ డిమాండ్ లేని కారణంగా కొత్త ప్లాంట్లు ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ ను కొనుగోలు చేసేందుకు సరఫరా సంస్థలు (డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలు) ఆసక్తి కనబరచడం లేదు. ఈ నేపథ్యంలో గత జూన్ లో విద్యుదుత్పత్తి సంస్థలు తమ సామర్థ్యంలో కేవలం 41 శాతం మేర మాత్రమే ఉత్పత్తి చేశాయి. నిర్మాణం జరుగుతున్న విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు పూర్తయితే పరిస్థితి మరింత విషమించే ప్రమాదం లేకపోలేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News