: 130 అంతస్తులు... రూ.10 వేల కోట్లతో ముంబైలో ఏర్పాటు కానున్న టాలెస్ట్ బిల్డింగ్
రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకెళుతున్న భారత వాణిజ్య రాజధాని ముంబై సిగలో మరో కలికితురాయి చేరనుంది. 130 అంతస్తులతో భారత్ లోనే అత్యంత ఎత్తైన భవనానికి ముంబై కేంద్రం కాబోతోంది. ముంబై పోర్టు ట్రస్ట్ కు చెందిన స్థలంలో ఏర్పాటు కానున్న ఈ ఆకాశహర్మ్యానికి రూ.10 వేల కోట్లకు పైగానే నిధులు ఖర్చవుతాయట. కేంద్ర షిప్పింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మితం కానున్న ఈ భవంతిలో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు కొలువుదీరనున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ఇంకా చర్చల దశలోనే ఉందని, త్వరలోనే దీనికి తుది రూపు ఇవ్వనున్నట్లు కేంద్ర షిప్పింగ్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. నిధుల విషయంలోనూ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఆ శాఖాధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మితమవుతున్న ఈ భవంతి కోసం ప్రభుత్వ ఖజానా నుంచి నయా పైసా ఖర్చు పెట్టకుండానే, ఈ భవంతిపై ఆసక్తి చూపే సంస్థల నుంచే నిధులను సేకరిస్తామని ఆ శాఖ చెబుతోంది.