: అతని బారిన పడ్డవారి సంఖ్య 9... పోలీసులకే అంతుచిక్కని దుండగుడి లక్ష్యం!
రోడ్డుపై ఓ మహిళ నిలబడివుంటుంది. ఎటువైపు నుంచి వస్తాడో... బైకుపై ముఖానికి మాస్క్ ధరించిన ఓ దుండగుడు వచ్చి, శరీరంపై ఓ ఇంజక్షన్ గుచ్చి పరారవుతాడు. ఆపై ఆ మహిళకు మత్తు వస్తుంది. దుండగుడు దోపిడీ చేయడం లేదు. కేవలం ఇంజక్షన్ ఇచ్చి పారిపోతున్నాడు. అతను ఎందుకు ఇలా చేస్తున్నాడో పోలీసులకూ అంతు చిక్కడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఇంజక్షన్ ఉన్మాది బారిన పడ్డవారి సంఖ్య 9కి చేరింది. కాలేజీల్లో చదివే అమ్మాయిలు, యువతులే లక్ష్యంగా ఇంజక్షన్లు ఇచ్చి పారిపోతున్నాడు. ఇతనిని పట్టుకునేందుకు మూడు రోజుల నుంచి పోలీసులు ప్రయత్నం చేస్తున్నప్పటికీ, దొరకలేదు. దుండగుడి లక్ష్యం ఏంటో, ఎందుకిలా చేస్తున్నాడో ఇప్పటికీ అంతు చిక్కలేదు. కేసును సీరియస్ గా తీసుకున్నామని పోలీసులు చెబుతున్నప్పటికీ, ఇంతవరకూ అసలా ఇంజక్షన్ ద్వారా శరీరంలోకి ఏం వెళుతున్నదన్న విషయం కూడా తేల్చలేదు. గత మూడు రోజుల నుంచి ఈ ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా పోలీసులు గట్టి నిఘా పెట్టి సాధ్యమైనంత త్వరలో ఉన్మాదిని పట్టుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.