: ప్రతిపక్షాలు అరిచి గీపెట్టినా ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మారుతుంది: కేసీఆర్
ప్రతిపక్షాలు అరిచి గీపెట్టినా పట్టించుకునేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మారి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. రాజీవ్ సాగర్ కు 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన కాంగ్రెస్ పార్టీ, దుమ్ముగూడెం దగ్గర ఇంటెక్ వెల్ ను కూడా నిర్మించలేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల అసమర్థత వల్ల తెలంగాణ నష్టపోయిందని అన్నారు. ప్రతిపక్షాల తీరును ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆయన చెప్పారు. ప్రజలు కూడా ఆలోచించాలని ఆయన కోరారు. బాబ్లీ పేరుతో చంద్రబాబు మహారాష్ట్ర వెళ్లి నానాయాగీ చేశారని ఆయన విమర్శించారు. ప్రతిపక్షాలు పనికిమాలిన ఆలోచనలు మానుకోవాలని ఆయన తెలిపారు. ఎక్కడ ప్రాజెక్టు కట్టాలనేది సాంకేతిక నిపుణులు నిర్ణయిస్తారని, రాజకీయ నాయకులు కాదని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అనవసరంగా లొల్లి చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.