: తెలంగాణ మంత్రులపై సంచలన వ్యాఖ్యలు చేసిన నాగం
తెలంగాణ మంత్రులు మూగజీవాలతో సమానమని బీజేపీ నేత నాగం జనార్దనరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రేపటి నుంచి చేపట్టనున్న రైతు భరోసా యాత్ర వివరాలు వెల్లడించిన సందర్భంగా హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ మంత్రులు డమ్మీలుగా మారారని అన్నారు. ప్రశ్నిస్తే జైలులో పెడతామని మంత్రి తలసాని హెచ్చరించడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. తెలంగాణలో ప్రభుత్వ పాలనను తాను ప్రశ్నిస్తున్నానని, దమ్ముంటే తనను జైలులో పెట్టాలని ఆయన సవాలు విసిరారు. మంత్రులు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని ఆయన హెచ్చరించారు. దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాలనపై దృష్టి కేంద్రీకరిస్తే, తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం పాలనను గాలికొదిలేశారని ఆయన విమర్శించారు. కేసీఆర్ ను చూసి తెలంగాణ ప్రజలు సిగ్గుపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.