: ప్రజల సెంటిమెంటును ప్రధానికి చెప్పా... ఇక ఆయనిష్టం: చంద్రబాబు


పార్లమెంటులో లైట్లన్నీ ఆర్పేసి, రాష్ట్రాన్ని విభజించినప్పటి నుంచి ఏపీ ప్రజల్లో తీవ్ర భావోద్వేగాలున్నాయని, ప్రత్యేక హోదాపై ప్రజల సెంటిమెంటును ప్రధానికి స్పష్టంగా వివరించానని సీఎం చంద్రబాబు మీడియాకు వివరించారు. హోదాను ఎంత గట్టిగా కోరుకుంటున్నారన్న విషయం ఆయనకు అర్థమైందని, ఇక అంతా ఆయన చేతుల్లోనే ఉందని వివరించారు. ఇంకా రూ. 12 వేల కోట్లకు పైగా కేంద్రం నుంచి రావాల్సివుందని తెలిపారు. ఈ నిధులను సాధ్యమైనంత త్వరగా ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని మోదీ హామీ ఇచ్చినట్టు వివరించారు. బుందేల్ ఖండ్ తదితర ప్రాంతాలకు జనాభా ప్రాతిపదికన ఇచ్చిన నిధుల్లానే, మనకూ నిధులివ్వాలని కోరినట్టు తెలియజేశారు. హైదరాబాద్ తో సమానంగా రాజధానిని కట్టేందుకు మోదీ సహకారాన్ని కోరానని, హిమాచల్ ప్రదేశ్ కు ఇచ్చినట్టుగా ప్రత్యేక పన్ను రాయితీలను సీఆర్డీఏ పరిధిలోని ప్రాంతానికి ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. పారిశ్రామికంగా రాష్ట్రం ముందడుగు వేసేందుకు ప్రత్యేక రాయితీలు కల్పించాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. కాశ్మీర్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీని కోరామని, స్పెషల్ కేటగిరీ స్టాటస్ లో ఉన్న గ్రాంటులతో సమానంగా రాయితీలుండాలని చెప్పినట్టు తెలియజేశారు. సెంట్రల్ యూనివర్శిటీ, ట్రైబల్ యూనివర్శిటీ, అగ్రికల్చర్ యూనివర్శిటీ, ఎయిమ్స్ తదితరాలన్నీ త్వరలోనే రాష్ట్రానికి రానున్నాయని చంద్రబాబు వివరించారు. ఏపీకి పొరుగు రాష్ట్రాలుగా ఉన్న తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి జరిగేంత వరకూ సాయపడాలని డిమాండ్ చేసినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News