: బీజేపీకి ఇబ్బందులు రానున్నాయ్... హెచ్చరించిన యువనేత హార్దిక్ పటేల్


పటేల్ వర్గం ప్రజల సమస్యలను పరిష్కరించకుంటే, 2017లో బీజేపీకి ఇబ్బందులు తప్పవని 21 సంవత్సరాల యువనేత హార్దిక్ పటేల్ హెచ్చరించారు. దాదాపు 60 వేల మంది పటేల్ వర్గం ప్రజలు వెంటరాగా అహ్మదాబాద్ జీఎండీసీ మైదానం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకూ దాదాపు 5 కిలోమీటర్ల దూరం పాదయాత్రగా వెళ్లిన హార్దిక్ తన వర్గం వారిని ఉద్దేశించి ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. "మన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకుంటే 2017లో కమలం వికసించదు" అని ఆయన అన్నారు. బీజేపీకి కీలక ఓటుబ్యాంకుగా ఉన్న పటేల్ వర్గంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన యువనేత హార్దిక్ అనతికాలంలోనే పట్టు సాధించారు. "మనం అందరి నుంచి నేర్చుకుంటున్నాం. సామాజిక మాధ్యమాలను ఎలా వినియోగించుకోవాలో మోదీని చూసి నేర్చుకున్నాం. అరవింద్ కేజ్రీవాల్ నుంచి కూడా కొంత నేర్చుకున్నాం. మనమంతా సర్దార్ పటేల్ వారసులం. సాంఘికంగా, సామాజికంగా మనం ఎదగాల్సిన సమయం వచ్చింది. మనకు రిజర్వేషన్లు ఇచ్చేంత వరకూ ఈ పోరాటం ఆగదు" అని అన్నారు. ఈ పోరు ఏ 100 మీటర్లకో పరిమితం కాదని, 'మారథాన్' పోరుకు పటేల్ యువత సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News