: బెంగళూరులో జెండా పాతిన బీజేపీ... సిద్ధరామయ్యకు షాకిచ్చిన కన్నడిగులు


బెంగళూరు మహానగర పాలక సంస్థ (బీబీఎంసీ... బృహత్ బెంగళూరు మహానగర పాలికె) ఎన్నికల్లో కమలనాథులు సత్తా చాటారు. మొత్తం 198 వార్డులున్న బెంగళూరు కార్పొరేషన్ లో స్పష్టమైన మెజారిటీ సాధించిన బీజేపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోనుంది. ఈ నెల 21న జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు నేటి ఉదయం ప్రారంభమైన సంగతి తెలిసిందే. కౌంటింగ్ లో ఆది నుంచి స్పష్టమైన ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థులు ముందంజలో నిలిచారు. కడపటి వార్తలందే సరికి మొత్తం 198 స్థానాలకు గాను బీజేపీ అభ్యర్థులు 100 వార్డుల్లో విజయం సాధించారు. ఇక కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు కన్నడిగులు ‘చేయి’చ్చారు. ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ రెండో స్థానానికే పరిమితమైంది. కడపటి వార్తలు అందే సమయానికి ఆ పార్టీకి 75 వార్డులు మాత్రం దక్కాయి. మాజీ ప్రధాని దేవేగౌడ నేతృత్వంలోని జేడీఎస్ కు కేవలం 14 స్థానాలే దక్కాయి. స్వతంత్ర అభ్యర్థులు 8 వార్డుల్లో విజయం సాధించారు. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు 103 స్థానాల్లో విజయం సాధిస్తే సరిపోతుంది. ఈ నేపథ్యంలో కొత్త పాలకవర్గాన్ని బీజేపీనే ఏర్పాటు చేయనుంది.

  • Loading...

More Telugu News