: కడప గడపలో కొల్లం గంగిరెడ్డి, అలీభాయ్ బ్యాచ్... పట్టేసిన పోలీసులు
ఎర్రచందనం అక్రమ రవాణాలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన కొల్లం గంగిరెడ్డి, అలీభాయ్ లు దేశం విడిచి పరారయ్యారు. తమకు సురక్షిత ప్రాంతాలుగా ఎంచుకున్న దేశాల్లో వారు తలదాచుకున్నారు. వారిని దేశానికి రప్పించేందుకు ఏపీ పోలీసులు ఓ వైపు తీవ్రంగా యత్నిస్తున్నారు. మరోవైపు విదేశాల నుంచే గంగిరెడ్డి, అలీభాయ్ చక్రం తిప్పుతున్నారు. గంగిరెడ్డి సొంత జిల్లా కడపలోని చెన్నూరు వద్ద నేటి ఉదయం ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లు పోలీసులకు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి రెండు టన్నుల ఎర్రచందనం దుంగలు, రూ.4.29 లక్షల నగదు, మూడు కార్లు, ఏడు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా వీరంతా గంగిరెడ్డి, అలీభాయ్ ల అనుచరులుగా పోలీసులు గుర్తించారు.