: పాతాళం వైపు... రెండు గంటల్లో 520 పాయింట్ల పతనం
సెషన్ ఆరంభంలో 370 పాయింట్ల లాభం. ఆహా, మన మార్కెట్లు రికవరీ అవుతున్నాయని ఆనందపడ్డ ఇన్వెస్టర్ల ఆనందం రెండు గంటలు కూడా మిగల్లేదు. ఉదయం 11 గంటల సమయంలో క్రితం ముగింపు స్థాయికంటే కిందకు జారిన సూచికలు నష్టాలను నమోదు చేశాయి. 26,116 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ 11:10 గంటల సమయంలో 150.57 పాయింట్లు పడిపోయి 0.58 శాతం నష్టంతో 25,590 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. దీంతో సెషన్ గరిష్ఠస్థాయితో పోలిస్తే సెన్సెక్స్ 520 పాయింట్లు పడిపోయినట్లయింది. మిడ్ కాప్ 1.13 శాతం, స్మాల్ కాప్ 2.16 శాతం, బీఎస్ఈ 100, 200 సూచీలు అర శాతం నష్టంలో నడుస్తుండటంతో నేడు కూడా మార్కెట్లు అనిశ్చితిలోనే సాగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. కాగా, మంగళవారం నాడు చైనా మార్కెట్ 4.5 శాతం నష్టపోయింది. ఆ ప్రభావమే ఇన్వెస్టర్లను కొత్త కొనుగోళ్లకు దూరంగా నిలిపిందని తెలుస్తోంది.