: పైలట్ గా మారిన రతన్ టాటా...సెల్ఫ్ డ్రైవింగ్ విమానంతో విజయవాడకు వచ్చిన వైనం
టాటా సన్స్ గ్రూపు సంస్థల 'చైర్మన్ ఎమెరిటస్' రతన్ టాటా కేవలం పారిశ్రామికవేత్తనే కాదండోయ్, ఆయనలో విభిన్న వ్యక్తే ఉన్నారు. నిన్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో భేటీ కోసం ముంబై నుంచి విజయవాడకు వచ్చిన రతన్ టాటా, ఆ తర్వాత విజయవాడ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఇందుకోసం ఆయన ఓ చిన్న విమానాన్ని వినియోగించారు. అంతేకాదండోయ్, సదరు విమానాన్ని రతన్ టాటానే స్వయంగా ముంబై నుంచి విజయవాడకు నడుపుకుంటూ వచ్చారు. చంద్రబాబుతో భేటీ ముగిసిన తర్వాత అక్కడినుంచి బయలుదేరుతున్న సమయంలో విమానం వద్దకెళ్లిన రతన్ టాటా నేరుగా పైలట్ సీట్లో కూర్చుకున్నారు. ఏమాత్రం తడబాటు లేకుండా సీటు బెల్టు తగిలించుకున్న ఆయన విమానాన్ని వినువీధిలోకి ఎగిరించారు. మొత్తం 13 సీట్లున్న సదరు విమానంలో టాటా వెంట మొత్తం 9 మంది వచ్చారని ఆ తర్వాత విజయవాడ ఎంపీ కేశినేని నాని చెప్పారు.