: కొండను పిండి చేసి రోడ్డేశాడు!
కృషి ఉంటే మనుషులు రుషులవుతారు, మహా పురుషులవుతారు అని ఓ సినీ కవి చెప్పిన మాటను నిరూపించే ఘటన ఇది. బీహార్ లోని గయ జిల్లాలో గెహలూర్ గ్రామానికి చెందిన దళిత కూలీ దశరథ్ మాంఝీ 22 ఏళ్ల పాటు నిర్విరామంగా ఓ కొండను తవ్వి గ్రామానికి రోడ్డు వేస్తే...అతని బయోగ్రఫీని మౌంటెన్ మేన్ పేరిట సినిమాగా రూపొందించిన సంగతి అందరికీ తెలిసిందే. అతనిలాంటి మరో వ్యక్తి మహారాష్ట్రలో ఉన్నారు. అహ్మద్ నగర్ జిల్లా గుండెగాన్ గ్రామానికి చెందిన రాజారాం బావ్ కర్ (84) అప్పట్లో ఏడోతరగతి వరకు చదువుకున్నారు. జిల్లా పరిషత్ పాఠశాలలో 34 ఏళ్లపాటు ఉపాధ్యాయుడిగా ఉద్యోగం కూడా చేశారు. సామాజిక స్పృహ కలిగిన రాజారాం తమ గ్రామానికి రోడ్డేయాలని అధికారులు, నేతల చుట్టూ తిరిగారు. ఎవరూ ఆయన వినతిని పట్టించుకోకపోవడంతో ఆయనే గ్రామానికి రోడ్డు వేయడానికి నడుం బిగించారు. 57 ఏళ్లపాటు ఏడు కొండలను తవ్వి 40 కిలో మీటర్ల రోడ్డును నిర్మించారు. ఇందు కోసం తాను సంపాదించిన మొత్తాన్ని, రిటైర్మెంట్ సందర్భంగా వచ్చిన డబ్బును కూడా ఖర్చుపెట్టడం విశేషం. గతంలో సైకిల్ వెళ్లేందుకు కూడా మార్గం లేని గుండెగాన్ కు ఇప్పుడు పెద్దపెద్ద ట్రక్కులు కూడా వెళ్తున్నాయట. ఇదంతా రాజారాం బావ్ కర్ చలవేనని గ్రామస్థులు చెబుతున్నారు.