: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు... రూ. 7 లక్షల కోట్ల సంపద ఆవిరి
భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో బ్లాక్ డే ఈ రోజు నమోదైంది. సెన్సెక్స్, నిఫ్టీలు కళ్లు బైర్లు కమ్మే రీతిలో పతనమవడంతో... ఈ ఒక్క రోజులోనే ఏకంగా రూ. 7 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ ఏకంగా 1,625 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 491 పాయింట్లు దిగజారింది. చైనా తన కరెన్సీ విలువను తగ్గించడంతో, దాని ప్రభావం అన్నిదేశాల మీద పడుతోంది. ముఖ్యంగా భారత్ లాంటి దేశాల మీద ఎక్కువగా పడుతోంది. ఇదే సమయంలో, అమెరికన్ డాలర్ తో పోలిస్తే మన రూపాయి మారకం విలువ రూ. 66.74కు పడిపోయింది. ఈ కారణాలతో, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దారుణంగా దెబ్బతింది. ఒకవైపు కేంద్ర ఆర్థిక మంత్రి, ఆర్ బీఐ గవర్నర్ కంగారు పడాల్సిన అవసరం లేదని చెబుతున్నప్పటికీ... ఇన్వెస్టరల్లో భయాందోళనలు తగ్గడం లేదు. ఈ క్రమంలో, ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపుతున్నారు. ఈ రోజు ట్రేడింగ్ లో 1,625 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ 25,742 కు పడిపోయింది. నిఫ్టీ 491 పాయింట్లు కోల్పోయి 7,809కి దిగజారింది. 2009 తర్వాత స్టాక్ మార్కెట్లు ఈ స్థాయిలో పతనమవడం ఇదే ప్రథమం. అమెరికా డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ రెండేళ్ల కనిష్ట స్థాయికి దిగజారింది. మరోవైపు చైనా మార్కెట్లు కూడా ఈ రోజు దారుణంగా పతనమయ్యాయి. షాంఘై మార్కెట్ ఈ రోజు ఏకంగా 8.75 శాతం పతనమైంది. 2007 తర్వాత షాంఘై మార్కెట్ ఈ రేంజ్ లో పతనమవడం ఇదే మొదటిసారి. హ్యాంగ్ సెంగ్, నిక్కీ, తైవాన్ మార్కెట్లు 4 నుంచి 5 శాతం వరకు పడిపోయాయి. యూరోపియన్ మార్కెట్లన్నీ 3 నుంచి 4 శాతం వరకు పతనమయ్యాయి. మరోవైపు క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పతనమయ్యాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 3.81 శాతం పతనమై 43.73 యూఎస్ డాలర్లకు పడిపోయింది. ఇదే విధంగా, నైమెక్స్ క్రూడ్ ధర 3.88 శాతం పతనమై 38.88 యూఎస్ డాలర్లకు పడిపోయింది.