: గుండెపోటుతో కుప్పకూలిన క్రికెటర్... ఆసుపత్రికి తరలించిన సహచరులు


క్రికెట్ మైదానంలో ఆటగాళ్లు ప్రాణాపాయ పరిస్థితులు ఎదుర్కొంటున్న ఘటనలు ఇటీవల తరచూ సంభవిస్తున్నాయి. తాజాగా, ముంబయిలోని ఆజాద్ మైదాన్ లో క్లబ్ క్రికెట్ ఆడుతున్న రాహుల్ సావంత్ అనే ఆటగాడు ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. గుండెనొప్పితో విలవిల్లాడుతున్న అతడిని సహచరులు బాంబే హాస్పిటల్ కు తరలించారు. 'డాక్టర్ హెచ్.డీ కంగా' లీగ్ లో సావంత్ దహిసార్ క్రికెట్ క్లబ్ తరపున వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ గా ఆడుతున్నాడు. మ్యాచ్ జరుగుతుండగా, గుండెపోటుకు గురయ్యాడు. అతడి పరిస్థితి చూసి సహచరులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ముంబయి క్రికెట్ సంఘం వైద్య సదుపాయాలు అక్కడేవీ కనిపించకపోవడంతో వారు వెంటనే సావంత్ ను ఆసుపత్రికి తరలించారు. సకాలంలో తీసుకెళ్లడంతో అతడి ప్రాణాలు నిలిచాయి. ప్రస్తుతం సావంత్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. 'మరికాస్త ఆలస్యమై ఉంటే ఏం జరిగేదో ఆ దేవుడికే తెలియాలి' అని దహిసార్ సీసీ కెప్టెన్ ప్రవీణ్ గోగ్రీ తెలిపాడు. "సావంత్ నొప్పి భరించలేపోయాడు. ఊపిరందక ఉక్కిరిబిక్కిరయ్యాడు. తాగేందుకు నీరు ఇచ్చినా ఫలితం కనిపించలేదు. కంగా లీగ్ నియమావళి ప్రకారం మ్యాచ్ లు జరిగే ప్రతి మైదానంలోనూ వైద్యులను అందుబాటులో ఉంచాలి. కానీ, వారెక్కడా కనిపించలేదు. అందుకే, మరేమీ ఆలస్యం చేయకుండా బాంబే హాస్పిటల్ కు తీసుకువచ్చాం" అని గోగ్రీ వివరించాడు. సావంత్ కు మద్యం, ధూమపానం వంటి అలవాట్లు లేవని, మంచి వ్యక్తి అని చెప్పాడు. 34 ఏళ్ల సావంత్ తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకని వెల్లడించాడు.

  • Loading...

More Telugu News