: ఏజెంట్లు లేకుండా హాలీవుడ్ లో కష్టమే: నటుడు ఇర్ఫాన్ ఖాన్
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ గత కొంతకాలంగా హాలీవుడ్ చిత్రాల్లోనూ నటిస్తూ తన రేంజ్ ను క్రమేణా పెంచుకుంటున్నారు. రాన్ హోవార్డ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'ఇన్ ఫెర్నో' చిత్రంలోనూ ఆయన నటిస్తున్నారు. కాగా, తన హాలీవుడ్ అనుభవాల గురించి మీడియాతో ముచ్చటిస్తూ... ఏజెంట్లు లేకుండా హాలీవుడ్ లో మనుగడ సాగించడం కష్టమని అభిప్రాయపడ్డారు. దానర్థం, ఏజెంట్లను నియమించుకుంటే ఇక లైఫే మారిపోతుందని చెప్పడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. "ఓ ఏజెంట్ సాయం లేకుండా హాలీవుడ్ లో మనం ఏమీ చేయలేం. ఫోనెత్తి నేరుగా ఫిలిం మేకర్లతో మాట్లాడే పరిస్థితి లేదక్కడ. ఓ ఏజెంట్ ను ఏర్పాటు చేసుకుని, అతడి ద్వారానే ప్రయత్నాలు సాగించాలి. తప్పదు, ఆ వ్యవస్థలో భాగం కావాల్సిందే. లేకపోతే ఏ పనీ కాదు. అయితే, ఏజెంట్ ను నియమించుకున్నంత మాత్రాన అవకాశాలు వచ్చిపడతాయనుకోవడం పొరబాటే అవుతుంది. అతడో మధ్యవర్తి మాత్రమే. అవకాశాలు సృష్టించలేడు. ఎక్కడన్నా అవకాశం ఉందని తెలిస్తే, దానికి సంబంధించిన డీల్ కుదర్చగలడంతే" అని వివరించారు. ఇర్ఫాన్ ఖాన్ 'స్లమ్ డాగ్ మిలియనీర్', 'పీకూ', 'లైఫ్ ఆఫ్ పై', 'ద అమేజింగ్ స్పైడర్ మ్యాన్', 'జురాసిక్ వరల్డ్' సినిమాల్లో తన నటనా ప్రతిభతో ఆకట్టుకున్నారు.